ప్రథమాంకురము

మనుమంచిభట్టు

అశ్వలక్షణసారము

రమణీముఖపద్మస్మేరస్మితమధురాసానుసేవానిపుణోదారబ్రమరవిహారస్వారుడు కృతిపతికి నిత్యసంపద లొసగున్.

అనఘుడు శాలిహోత్రుఁడు హయంబులకున్ మును జెప్పినట్టియాయనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్దెనుగున నెల్లవారలకు తేటపడన్ రచియింతు సత్కవుల్వినికొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్వరా.

హయలక్షణవేత్తయగు శాలివాహనుఁడు మున్ముందుగా చెప్పిన అశ్వలక్షణములను, ఆయుఃప్రమాణమును గురించి తెలుగున సర్వజనులకు దెలియునట్లుగను - సత్కవీశ్వరులు గొనియాడునట్లుగను జెప్పెదను. అని కృతికర్తయగు మనుమంచిభట్టారకుడు జెప్పియున్నాడు. ఈగ్రంథము సాళువ కంపభూపాలున కంకిత మీయబడినది.

జలనిధిమథనావసరమునజలజభవునిమేనిపద్మజలకణములు గా

డ్పులసంగమమున బావకువలె హరులు పుట్టె గన్న వసుధాధీశా!

దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను.

తొలుతదంతంబులు తోచిన నొకనెలనెలలు రెం డగు నవి నెరసి నిగుడనడిమిదంతములు గానగనైన మూణ్ణెల్లుయవి వెస గూడంగ నైదునెలలుకడమదంతంబులు వొడమ నెన్మిదినెలల్యవి గూడ తొమ్మిది యయ్యె నెలలుదశనంబు లారును విశదమైనను నేడుయేళ్లు రెం డగు నవి ఎర్రనైనమొదటి రెండును బది గూడ మూడుయేండ్లునడిమి రెండును పది గూడ నాలుగేండ్లుఅవియు రెండును బది గూడ నైదు యేండ్లుయరయ హరులకు గన్నదండాధినాథ.

ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత

ములు విశదము లైయున్న యేడునెల లగును. ఆదంతము లెర్రనయిన రెండేండ్లు అన్ని పండ్లును గలియుట కయిదేండ్లు పట్టును.

దంతముల తెలుపు చిత్తక్షాంతియు కన్నులమెఱుంగు జవసత్వములన్సంతతమును దక్షతయునుకాంతియు నైదేండ్లఘోటకంబున కలరున్.

దంతములు తెల్లనగుట, స్థిరచిత్తము కలుగుట, కన్నులలోని వెలు గతిశయించుట, బలము, పనిచేయు నేర్చును శరీరమునందలి తేజస్సును గలతురగముయొక్క వయస్సు అయిదు వత్సరములు.

ఇది విచారించుటయునువిదితంబుగ సశ్వములకు నినువ్యంజనముల్మొదలుకొని వరుస జెప్పెదసదమలగుణయూధ కన్న జగతీనాథా!

పైన చెప్పబడిన విషయముల నిరూపించుటయును, వ్యంజనముల క్రమంబును యొకటొకటిగా చెప్సెదను.

నల్లనిరేఖ కృష్ణహరిణంబు సువర్ణవిభాతి శుక్లమున్తెల్లని కాచగాజుపగిదిన్ జనుపక్షికయీగె యట్లు శోభిల్లును శంఖచంద్రుగతి బెద్దయు గృంత లులూఖలం బగున్బెల్లుగ నూడుటంబడుట బేర్కొన తొమ్మిదివ్యంజనా లగున్.

చూడుము మూడవయాశ్వాసము. కృష్ణవ్యంజనము, శుక్లము, హరిణవ్యంజనము, మక్షిక, శంఖఉలూఖలము, చలనవ్యంజనము, పతనవ్యంజనము, కాంచవ్యంజనము.

నెట్టున మొదలిరదంబులుబుట్టిన నొకయేడునడిమి పళ్ళును నొనరన్

బుట్టిన రెండేడులు తుదబుట్టిన మూడేండ్లు యిట్లు పరువడి నడచున్.

మొదటిరదనములు తోచినయెడల నొకసంవత్సరమును, మధ్యపండ్లు బుట్టిన రెండేడ్లును, వెనుకటి రెండుదంతములును బుట్టిన మూడేన్లును యుండును.

ఈనవవ్యంజనంబులు యిట్లు నడువనెలమి యిరువది యేడేళ్ళు యిందులోనతొలుత నైదేండ్లుగూడి తురగమునకునరయ ముప్పదిరెండేండ్లు యాయువయ్యె.

పైన చెప్పబడిన తొమ్మిదివ్యంజనములును గడచుటకు యిరువదియేడు వత్సరములగును. ఆయిరువదేడు వత్సరములును బాల్య మైదేడులును కలసి గుర్రమునకు ముప్పదిరెండు వత్సరములు పూర్ణాయువయ్యెను.

గ్రంథపాతము యితరప్రతులలో నున్నదేమో తెలియదు.

ఉరమున నుపరంధ్రంబులశిరసున రంధ్రంబులందు జెలువుగ రెండేసరయగ కుదుటను మూతినిబరువడి యొకటొకటియున్న పదిధృవులయ్యెన్.

సులభసాధ్యము. గుర్రమునకు తప్పక పదిసు ళ్లుండవలయును.

ధృవులు పది యశ్వజాతికినవి తక్కువయైన తురగ మల్పాయువగున్సవరించు పతి కరిష్టముసవరించరు గాన బుధులు సహియింపరుగా.

ధృవులు పది యుండవలయును. పదికంటె తక్కువయైనయెడల నాయశ్వము అల్పజీవి యగును. ఇంతియేగాక ఆగుర్రముయొక్క

యజమానునకు గూడ కీడుగల్గును. అందువలన హయశాస్త్రవేదు లెవ్వరును యట్టిగుర్రమును కొనరు.

మస్తకహీనము బహుదురవస్థంబడి జచ్చు నైదువర్షంబులలోస్వస్తపడి నిలిచెనేనియుమస్తకమును ద్రుంచు పతిని మర్త్యులచేతన్.

చిన్నిమస్తకము (తల) గలిగియున్న గుర్రము పెక్కుచిక్కులకు లోనై యైదువత్సరములలోపలనె మరణించును. అట్లు మరణింపకున్న నాహయము తన్ను పాలించువానియొక్క మస్తకమును రిపులచే ద్రుంపఁజేయును.

స్థిరముగ రోచమానమును దేవమణిందగ గూడియున్న యాతురగము పూర్వభాగ గతదోషములన్నియు ద్రుంచునెట్టినన్బరిగినయట్లు మేఘవిక పశ్చిమభాగము దోషరాసులన్బొరిబొరిద్రుంచు మాడ్కి మరి భూవరకడ్పున దక్క నన్నిటన్.

మెడమీదనుండునట్టి జూలునందు సుడియును దేవమణియను సుడియును గల తురంగము యితరదోషములను బోకార్చి శుభంబుల నొసంగును.

చుంచున కేశాంతంబులనంచితముగ నెలవులందు నావర్తములన్మెంచలర దాల్చు హయములుపంచాయుధజనక శుభము పతి కొనరించున్.

ముట్టెయందును, కేశాంతమునందును, నెలవుయందును, (నోటి కిరుప్రక్కలనుండు మూలలందును) సుళ్ళు గలిగిన హయము తన్ను పరిపాలించు యజమామనకు శుభము నిచ్చును.

బాహువులను సుళ్ళు గలిగినబాహావర్తంబులనగ ప్రభులకు నెపుడున్బాహులను దొడుగు దొడవులుయాహవమున జయము నొసగు నరిబలభేదీ.

ముందరకాళ్ళ సుళ్ళు గలిగియున్న తురగము బాహావర్తతురంగ మనబడును. దానిని పాలించు యధికారి యుద్ధములందు జయలక్ష్మిచే వరింపబడును.

ఇప్పుడు జెప్పిన ముప్పదిరెంటిలోనుత్తమూవక్త్రంబు నుండునెడలనిటలతటంబున నిశ్రేణిత్రేతాగ్నిబాతురంతికము ప్రఖ్యాతి మెఱయ

* * * * * *

రోచమానంబు గదియంగ రోమజములచాలు గుఱ్ఱమునకు గల్గి చాలమేలుతొలుత పదిసుళ్ళు గూడంగ నలుబదేనుమేలు చాతుర్యభోజ లక్ష్మీతనూజ.

ముందరికాళ్ళను మోకాళ్ళు జంఘలవిడిపట్లమణుగుల మడుగులందుతొలగులబిరుదున తొడలందు సగులనటక్రిందిపిక్కల యండములనుకాశదేశంబున గుదమున ప్రక్కలబొడ్డున వీపున బొమలమీదకుత్తుక కన్నుల కొలకుల రెప్పలకర్ణమూలములను కటములందు

దండమున ముక్కుజమరుల క్రిందిపెదవిచెక్కులను మూతిమీదను జెవులతుదలకన్నుగవ నాసికమునకు గలిగియొనరనున్నసుళ్ళొప్ప నిన్నియు గన్నభూప.

ముందరికాళ్ళయందునను, మోకాళ్ళయందునను, జంఘలు కలియుచోట్లను, మణుగులందును, పిరుదునందునను, తొడలయందునను, అడుగులయందును, పిక్కలయందును, అండములయందును, యోనిదేశమునను, బొడ్డునను, వీపుమీదను, కనుబొమలమీదను, కనుకొలకులందును, రెప్పలందును, చెవిమూలములందు, గండభాగమునందును సుళ్ళుండదగు సులభసాధ్యము.

కకుదంబున హల్లకమునద్రికమున సందులను సుళ్ళు దిరమై యున్నన్బ్రకటికదోషం బగు నిదినకులాదులమతము దండనాయకతిలకా.

మూపుమీదను హల్లకమునను గుదస్థానమునందును చంకలయందును సుళ్ళుగలిగిన వాజి దోషయుతమగును.

జలజకులిశకలశ చామరతోమరచక్రముసలముకుర శంఖచంద్రమణిసితానఖడ్గ నుచ్ఛాంకుశాదులుగతులలొల్లు మేలు గన్ననృపతి.

పద్మము కులిశము చెంబు దామరము తోమరము చక్రము ముసలము రోకలి ముకురము (మొగ్గ) శంఖము చంద్రుఁడు మణిఖడ్గము అంకుశము మున్నగువానివలె నుండు తెల్లనిబొల్లి యుండుట మంచిది.

శూలపాశనిగళ నీలపీతారుణగతులబొల్లుగీడు గడిమదలనుక్రిందిపెదవి జమర రుజలందు నెడతెగియున్నపుండ్రరేఖ యొప్పదండ్రు.

శూలము పాశము నిగళము (శృంఖలు-అరదండములు.) నీలివన్నె పచ్చనివన్నెగల బొల్లులుండరాదు, అందువలన కీడు సంభవించును. తలయందును క్రిందిపెదవియందును ముక్కుజెమరలందును బొల్లియుండరాదు.

దంతాధికంబును దంతకనమును హీరాళియైనను విరాళియైనబిల్లికన్నులు నేకపింగళియును నొంటిబీజంబు లెమ్మును బిల్లిచెవియుదినమునబుట్టిన గనయుద్భవిల్లినజనుబొట్టు కరగుఱ్ఱమునకునున్నకృష్ణతాలువలు మిక్కిలియైన గొరిజలునల్లని కడు పెల్ల వెల్ల..............................................అట్టిహయముల సాలల గట్టజనదుమల్లయామాత్యపుత్ర నిర్మలచరిత్రఅహితహృద్భల్ల రాయసౌహత్తిమల్ల.

ఎక్కువదంతములు తక్కువదంతములు గలిగిన గుర్రమును కరాళినికరాళిని (వీనియర్ధము ముందు వివరరింపబడును.) పిల్లిగండ్లు కలదియు యేకపింగళి (ఒకకన్నుదృష్టి) ఒకబీజము కలది పిల్లిచెవులు రెండు పిల్లల నీను గుర్రము నల్లని తాలువలు గలది పెద్దపెద్దగిట్టలు గలది మున్నగు దోషంబులుగల గుర్రములను పెంచకూడదు.

కరాళి = భయంకరమైనది.వికరాళి = భయంకరమైనదానికి వ్యతిరేకము.

మూడుకాళ్లును గల్గినముసలి యొక్కపదము నలుపైన నది విషపాది యంద్రుసన్నమగుచున్న దోషంబు లెన్నియైననుదుట బొల్లుంట మేలు సమ్ముదితహృదయ.

మూడుగాళ్ళను తెలుపైన బొల్లియుండి నాలుగవపాదము నలుపైనయెడల నాగుర్రము విషపాది యగును. కాళ్ళు సన్నమైనయెడల దోషముల నెన్నిటినేని బోకార్చును.

మెఱుగారిక్రాలు మేనునునెరిసిన తమ్మిమాడ్కి నెమ్మొగమున గ్రొమ్మెరుగుల దెగడెడి కన్నులునెరివాలము గలుగు హరులు నివి యోగ్యంబుల్.

మెఱుగెక్కియున్న శరీరమును, సగము విడిచిన పద్మమువలె నుండు నెమ్మొగమును, కాంతివంతములైన కన్నులును చక్కనివాలమును గలహయములు శుభము చేకూర్చును.

ఛాయావిహీనమైననువాయసఖరగృధ్రముఖ్యస్వరమైనను ద్వైన్యాయపదగదితవదనము చిరాయువు గలుగవని విందు మట్టి హరులకున్.

కాంతివిహీనమైనను కాకి-గాడిద-గుడ్లగూబ మొదలగువాని స్వరముబోలిన స్వరముగల కురంగములు చిరాయువులుగ నుండవనిపెద్దలమతము.

వరగినమొగమును నాలుగుచరణంబులు తెలుపు గలుగ జయ మొసగునరే

శ్వరునకు నత్తురగం బిలఖరకరనిభతేజ పంచకల్యాణి యగున్.

నాలుగుకాళ్ళను తెలుపు గలిగియున్న హయము పంచకల్యాణి యనందగును. అయ్యది రౌతునకు సర్వదా జయము కలిగించును.

నాలుగుకాళ్ళుం గొనచెవివాలము వదనము విశాలవక్షము తెలుపైక్రాలునది యష్టమంగళినేలినపతి యేలు ధరణి నేలినపతులన్.

నాలుగుకాళ్లును చెవులయొక్క కొనలును తోకయును ముఖమును విశాలమైన వక్షస్థలమును తెల్లనివై యున్నయెడల నాగుర్రమును యష్టమంగళి యందురు. ఆగుర్రమును పాలించువాడు ధరణీపతుల నేలును.

హేషారవంబు గజగళఘోషానక పయోధిఘోషణ భేరీఘోషణ దిక్కరిబృంహితఘోషణగతి నుండవలయు ఘోటకములక్కున్.

గుర్రములయొక్క ధ్వనినిగూర్చి చెప్పుచున్నాడు. సులభసాధ్యము.

తొల్లి శతాయువు హరులకుఎల్లను దుర్జనుల మోవ నేహ్యంబని తారొల్లక ముప్పదిరెండేళ్ళల్లన తురగములు వడసె నమరులచేతన్.

పూర్వము బ్రహ్మ గుర్రములు దుర్జనులగువారిని గూడ మోయుచుండుట జూచి విచారపడి వాని యాయుఃప్రమాణమును ముప్పదిరెండుసంవత్సరములుగా నేర్పరచెను.

వన్నె సుధాధవళంబైచెన్నారగ నల్లనైనచెవి కల్గిన యాసన్నత తురగము యీభువిగన్నయధరణీశ నామకర్ణాంక మగున్.

తెల్లనిశరీరము గలదై నల్లనైనటువంటి చెవి గలిగిన యశ్వమును కర్ణాంక మందురు.

హరి యని నర్కబింబుని శుకాంగుని గొంగుని గొంగుపాణినాతరగనికత్తలాని ప్రమదంబున నెక్కడిచోట భూపతుల్సురపతి కృష్ణ వహ్ని శివ సూర్య పితామహ వాయు సోములన్వరుస దలంచి మ్రొక్కు నది వారకదైవతకోటి గావుతన్.

హరి, అర్కబింబము, శుకాంగు, కొంగ, గొంగుపాణి, తరగిణి, కత్తలాని ఈపేర్లు గలిగిన గుర్రముల నెక్కునప్పుడు ఇంద్రుని కృష్ణుని అగ్నిని శివుని సూర్యుని బ్రహ్మను వాయు చంద్రుని దలచి వారికి నమస్కరించి ఎక్కవలయును.

నీలిని నలగని శోణినినీలోత్సంహయము బన్ని నృపు లెక్కినచోమేలుగ నదియును త్వష్ట్రలకీలినివాయువు దలంప గెలుపుగు బోరన్.

నీలి సలగ శోణి నీలోత్సలము ఈనాలుగుపేర్లుగల గుర్రములు నెక్కునప్పుడు అగ్నిని వాయుదేవుని దలంచికొనిన శుభము చేకూరును.

చతురమగు నొసల నాలుగువితతముగా నశ్వములకు పెలసిన ధృవులన్మతిదలంప మేలునిచ్చునుపదునాలుగుదేశములకు బట్టము గట్టున్.

గుర్రముయొక్క నొసటను చతురాకారముగ నాలుగుధృవు లున్నయెడల నాగుర్రము తన్నేలినదానిని పదునాలుగుదేశములకు పట్టభద్రుని చేయును.

పట్టముక్రియ ఫాలంబునవెట్టణముసుళ్ళుమూడు నేర్పడియున్నన్గట్టుము హయమును శాలనుసృష్టికి పతి యతఁడు సువ్వె స్థిరమతి దలపన్.

పటకావలె నుదిటిపై మూడుసుళ్లుగలిగిన యా తురగమును శాలలోనికిఁ జేర్చుము. ఆగుర్రము నేలిననవాడు బహ్మతో సమానుఁ డగును.

ఒండొంటి మీద దొంతినిరెండున మూడైనధృవులు రుజలైయున్నన్గండత నిజముగ నిలుపుముభండగమున నశ్వ మిచ్చు బతికి జయములన్.

సులభ సాధ్యము.

నిటలమున దొంతివలసయుపటుతరముగ సుళ్ళుమూడు ప్రభవించినచోనిటలాక్షు డడ్డగించినచెటులత ననిలోన వైరి శిరమును దృంచున్.

సులభ సాధ్యము.

మిక్కిలి దోరణములక్రియజక్కగ రోమజయము లశ్వసంఘము నుదుటన్నిక్కము గల్గిన శుభమౌఎక్కుము రణరంగభీమ యెంతయు బ్రీతిన్.

అధికముగా సుళ్లు దోరణమువలె నున్నయెడల శుభదాయక మగును. దానిని యధిరోహించు యజమానునకు శుభము చేకూరును.

తురగంబు నొసలినిూదనుబరికింపగ రెండుధృవులు ప్రభునకు శుభమౌనరనుత నిలువగవలయునుధరణీశ్వరకాంతనృపతి దానవినోదీ.

గుర్రముయొక్క నొసటను రెండుధృవులు గలిగినయెడల తన్నేలినవానికి శుభము చేకూర్చును.

కుత్తుకసుడిగల తురగముచిత్తజనిభుడైన నేమి సిద్ధము దలపన్ఉత్తమపురుషులు నిలువరునిత్తంత్యంబును జూడ జమునినిలయము కేగున్.

సులభసాధ్యము. కుత్తుకమీద సుడి యుండరాదు.

ఉభయగళములకు నెల్లనునభిముఖముగ ధృవులు గల్గు నశ్వము నిలువన్శుభమగుకంఠాభరణముప్రభునుత భీమాంబపుత్ర పరమపవిత్రా.

గళమునకు రెండుప్రక్కలనుగాని యెదుటనుగాని సుళ్ళుగలతురగము కొనవలయు. అట్టిగుర్రము శుభముచేయు.

మేలుగ గళంబుక్రిందనునాలుగుయంగుళముల రెట్టి నగు సుడి యున్నన్యేలుమది దేవమణి యనిబాలార్కసమానతేజ బంధునిధానా.

సులభసాధ్యము. గళముక్రింద ఎనిమిదంగుళములకు క్రింద సుడియున్న యిది దేవమణియను సుడియగును. దాని నేలవలయును.

దేవమణి క్రిందసుడియునుభావింపఁగ రోచమాన మగునని ధాత్రిన్భావజసన్నిభ నిలువుముభూవనితాప్రియుడ కన్న భూపలలామా!

దేవమణి క్రిందగానున్న సుడిని రోచమానమందురు. అట్టిగుర్రమును భదాయము. తప్పక కొనవలయును.

రోచమానంబుక్రింద నిరూఢమగుచునమరసుడి జెర్రిప్రాకిన నట్టిరేఖపేరుహరికి జూడ ధారుణిలో శతపాది యనిరి యశ్వభావవిదులు.

రోచమానముక్రింద జెర్రివలె గొన్నిటిసుడి యుందును. అట్టి గుర్రమును శతపది యందురు.

బాహుల వక్షస్థలములనూహింపగ ధృవులు గలుగ నుచితము విలువన్ఆహవభీము డపాత్రతదేహీజనకల్పభోజ దినకరతేజా.

ముందరి కాళ్ళమీదను వక్షస్థలంబునను ధృవులు గలిగియున్న యశ్వమును గొనవచ్చును.

త్రికమున వీపున కకుదాంగకములనుభృకుటిపై నాసాగ్ర పుటముమీదహృదయమునను నాభి యుదరము కుత్తుకచెక్కున ముక్కున ప్రక్కలందుగుదమున విత్తుల కోశము మెడలపైనేత్రాల నాలుగు గోత్రములను

మస్తమధ్యను మానుగాకటములన్నేకవింశతి ధృవు లెరుగజనులుయిట్టిదోషంపుహయములు గట్టదగదుగట్టినంతనె చెట్టలు బుట్టుచుండుబుధజనస్తోత్ర సద్గుణపూర్ణగాత్రవంశకులదీప శ్రీకన్నవసుమతీశ.

అవయవములందు నెడలకధ్రువులుండగ వలయు మరియు తురగంబులకున్దివిరి యొండొంటి నెడలకసువిచారు డనామతంబు సుభగమనోజా.

గుర్రము యొక్క యవయవములందు తప్పక సుడియుండవలయును. ఆసుళ్ళు విచ్చిన్నముగాక యుండవలయును. ఒక్కొకసుడి రెందపదానిని తాకి దానిని వికలమగునట్లు చేయకుండవలయును. అని మనుమంచిభట్టు తనయభిప్రాయము జెప్పెను.

మిక్కిలి నశుభములైననుదక్కున శుభధృవులు గల్గ దగ దెక్కంగాఎక్కుమురుజులకు శుభములుమిక్కిలి గలుగంగ జూచి మృగపతిశౌర్యా.

అశుభసూచికంబులగు సుళ్ళధికముగను శుభసూచికంబులగు సుళ్ళు స్వల్పముగనుయున్న యశ్వమును గొనదగదు. శుభసూచకము లధికముగానున్న పరిశీలించి దాని నెక్కవలయును.

కలియుగమున తురగములకుసలలితముగ బాహుయుగము సన్నములైనన్బిలువుము తురగము శుభ మినియిలతలమున కొంకణపతి యిభరిపుశౌర్యా.

గుర్రమునకు ముందటి కాళ్లు సన్నములై యుండుట మేలు.

వాలంబు బాహుజంఘులమేలుగ కంఠాననంబుమేదినిమీదన్ఫాలము కర్ణము మేడయునుజాలగ దీర్ఘంబులైన జనమాని యగున్.

తోకయు కాళ్లును జంఘలును కంఠము ముఖము చెవులు మెడయును మిక్కలి పొడవైనతురగము మిక్కిలి జనసత్వముగలది యగును.

బాహులు జంఘలు మద్యమువాహనపతి నెరుగుముఖము వాలము జెవులున్నూహింప కురుచ లైననుఆహవభీముండ సత్వ మధికముసుమ్మీ.

కాళ్లును జంఘలును మధ్యభాగము (కటిప్రదేశము) ముఖము తోకయు జెవులును కురుచ లైయున్న యశ్వము వేగముగా పోవునది గాకున్నను బలముకలది యగును.

ముష్కములు కురుచ లై కడుశుష్కంబులు నైన జూచి సుజనుడ విలువన్నిష్కముల లెక్క చేయకదుష్కరముల పొంద డెంతదూరం బైనన్.

ముష్కములు (వృషణములు) కురుచ గలిగి ఎండిపోయిన ట్లున్నయెడల రూప్యములు ఖర్చు పడునని లెక్క సేయక తప్పక గొనవలయును. ఎంతధనము వెచ్చించినను నష్టములేదు.

పలువరుసనేడు దంతాలుకలిగిన జవసత్వహీన కాంతివిహీనన్

విలువరుపతులకు నెక్కడకులజలనిధిపూర్ణసోమ గుణరత్ననిధీ.

ఏడుదంతములు గలదానిని బలము జవము లేనిదానిని శాంతిలేనిదానిని భూపతు లెక్కకూడదు. దానిని కొనరు.

బలువై కొలది వెన్నునువలుదగుమధ్యంబు నిడుదవాలము నైనన్వెలయగ వట్రువలైననుగలుగుయెడ గుర్రములను గట్టుము సాలన్.

బలమైనట్టియు కురచయైనట్టియు వీపును బలముగలిగి లావైనమధ్యమును పొడుగుపాటితోకయు గలిగినటువంటి గుర్రమును సాలయందు గట్టియుంచుము.

బడపల బోలెడిరూపముకడుగుర్రము పతుల కెక్క కడుయోగ్యము దాకడువర్ధి నిలువవలయునుకలియుగమున సిరియొసంగు కన్ననృపాలా!

ఆడుగుర్రము ముఖమువలెనున్న మొగగుర్రము శుభదాయకము తప్పక నిలుపవలయును.

వదనంబును భ్రూలంఘ్రులువిదితంబుగ దెల్ల నైన నిలువుము హయమున్కదనమున నెక్క నతనికినెదురారిపు ఘోటకము నేనుగుఘటముల్.

ముఖమును అంఘ్రులును భ్రూయుగమును తెలుపైయున్న యశ్వమును గొనుము. దాని నెక్కినవానికి శత్రుసేనలోని గుర్రములు యేనుగులు సులభసాధ్యములు.

భూపాలయపరగాత్రమునేపారగ దెల్ల నైన నెక్కుము హయమున్యేపై నిలువగ వలయునుయేపొందుం లచ్చిమిగుల వినయగుణాఢా.

కంఠముయొక్క క్రిందిభాగముగాని మీది భాగముగాని దెల్లనైన గుర్రమును నధిరోహించుము. అట్టిహయమును కొనినవానిగృహంబును నైశ్వర్యములు సర్వదా నిలచియుండును.

నొసల జుక్క లేక శశికాంతి నొకకాలమూడుకాళ్లు గలుగు మొసలి యండ్రుదీని నిలుపవలదు మానవులకువంశదీప కన్న వసుమతీశ.

నొసటిమీద తెల్లనిమచ్చ లేకను, మూడుకాళ్లును తెలుపుండి యొకకాలను తెలుపు లేకున్న నాయశ్వమును మొసలి యందురు. దానిని గొనవలదు.

వలపలికాళ్ళును రెండునువెలయగ సితవర్ణమైన విలువుము హయమున్సలలితవామాంగంబులువెలయగ దెలుపైన గాదు విమలవిచారా.

వలపలికాళ్ళు రెండును తెల్లని వైనయెడల నాహయమును తప్పక గొనుము, ఎడమభాగము తెల్లనైన నాహయంబులను గొనవలదు.

పాదములు మూడు గడగినభేదింపగ మొసలియండ్రు పెద్దలు హయమున్మేదినిలొ జూడగ నొకపాదంబడి గడగవిషమపాదిది యయ్యెన్.

మూడు పాదములు తెలుపై యొకపాదము నలుపైన మొసలి యండ్రు. అటుగాక మూడు నలుపై యొకటి తెలుపైన నది విషపాది యని పిలువబడును.

ఎక్కగ జన దమ్మొసలినినిక్కంబుగ విషమపాది నిందితమయ్యెన్ఎక్కుము నుదుటను హయముకుచక్కగ బొల్లుండెనేని సౌజన్యనిధీ.

ఆమొసలి యని పిలువబడు తుగంగమును యెక్కబోవకుము. అది విషపాదియగుటచే నింద్యము. నుదుటను చక్కనిబొల్లి యున్న యశ్వము నెక్కుము.

పట్టరు గోడిగ నేక్రియసృష్టిశ్వర వెనుకపడము సితమైయున్నన్నెట్టనమూత్రము విడిననుబుట్టవు దోషంబులండ్రు బొల్లరిలేమిన్.

గుర్రముయొక్క పృష్ట భాగము వెల్లనై యున్నయెడల నాగుర్రమును కొనరు. అధికముగ మూత్రమును విడుచు హయమును గూడ దోషము కలుగునని తలంచి గొనసాహసించరు.

పురుషాశ్వమునకు ముందటసరసిజరిపువర్ణమైన చరణము గలుగన్స్థిరమతి విలువగవలయునుయరుదుగ మూత్రంబు దాకి యరుగుంఋజులన్.

మగగుర్రమునకు ముందటిభాగము సూర్యుని యొక్క వర్ణమైనచో బుద్ధిమంతులు దాటిపోనీయరు. తప్పక స్థిరచిత్తముతో గొందురు

శ్రీజన్మసదనరాజవా జికయసమాననయన రాజీవునకున్రాజులకు దుగ్ధవారధిరాజునకున్ కుమారకంపరాజున కెలమిన్.

షష్ఠ్యంతములలోనిది గావచ్చును. పెక్కులగు మాత్రుకలలొ నీపద్యము గానరాదు.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన హయలక్షణవిలాసంబను కృతికి కథానిధానం బెట్టిదనిన నశ్వప్రశంసయునావర్తలక్షణంబును దశాక్షేత్రవిభాగంబును ప్రావేశప్రమాణంబును వయోజ్ఞానంబును వర్ణలక్షణంబును ఛాయాలక్షణంబునుగంధలక్షణంబును గతిలక్షణంబును సర్వలక్షణంబును పుండ్రలక్షణంబును సామాన్యదోష మహాదోష దోషతమప్రకారంబును నుత్తమాశ్వలక్షణంబును విహీనలక్షణంబును చికిత్సయు లవణవిధియు ఉకకవిధియు గడ్డికపణప్రకారంబును క్రమంబున జెప్పెదనందు నశ్వప్రశంస యెట్టిదనిన.

అశ్వములకు సంబంధించిన వివిధములగు లక్షణముల చెప్పెనేని సూచించినాడు. సులభసాధ్యము.

అంబుధివేష్టితావనియు తాజి జయంబు మహాయశఃప్రతాపంబును నిత్యలక్ష్మియు సంసారసుఖంబుల నొందునందు ధర్మంబును వైభవోదయ సమగ్రముదంబులు గల్లి యొప్పువాహంబులు చాలగల్గు వసుధాధిపు డెప్పుడు నింద్రతుల్యుఁడై.

గుర్రము లధికముగా నేభూపాలునియొద్ద నుండునో యాభూపాలుఁడు చతుస్సముద్రముద్రికధరావలయంబు పరిపాలించుచు యశఃసాంద్రుడై లక్ష్మీయుతుఁడై సర్వసౌఖ్యంబుల నొందుచు అధికవైభవము గలవాఁ డగును.

అరయగ సర్వలక్షణసమంచితమైన తురంగరత్న మీనరుని గృహంబునం దొకదినంబుననుం దగురీతి నుండునాపరమపవిత్రగేహమున బాయకనిల్చు రమావధూటు శ్రీధరు యురస్థలింబలె ముదం బెసలార ప్రసన్నచిత్తయై.

సర్వశుభలక్షణములను గల్గిన గుఱ్ఱ మేనూనపునియింట నొకదిన౦బు యున్నను యామానవునకు యధికంబులగు ధనంబులు లభించి స్థిరమై నిలిచియుండును.

జనసత్వాన్వితవైభవావళులచే సంపూర్ణమైయుండు నేయవనీపాలునిసైన్య మాతని సముద్యత్కీర్తి బెంపారియున్ననపర్యంతవసుంధరావలయమున్ మానంబుతో నేలుశాత్రవ ...................................................................

గ్రంథపాతముచే గడమపాదము నశించినది. అర్ధము స్ఫురించుటలేదు.

................................................................త్రవధరణీధరేశ్వరుని దానముపాలిటి లచ్చియై మహోత్సవములుగల్తగూర్చు రణధామములో మహరాజకోటికిన్శివశివఘోటకంబులు విచిత్రపు దూలికలే తలంపగన్.

గ్రంథపాతము పైపద్యముతో కలిసి పెక్కుమాత్రుకలందు కలదు.

దూరము బోవునప్పుడును దుర్దమశత్రునృపాలసైన్యముల్బోరున గెల్చుచున్నపుడు బొంకముతో మృగయావినోదవిద్యారతి దేలునప్పుడు నరాధిపకోటికి వాజులట్లు బెంపార జయాదికారణము లారసిచూడగ గల్గనేర్చునే.

దూరదేశముల కేగవలసివచ్చినప్పుడును శత్రువులను జయింపబోవు నప్పుడును వేటాడుటకుమున్న విద్యాప్రసంగముల దేలునప్పుడు

ను రాజులకు గడుంగడు సహాయ మొనరించి జయము చేకూర్చును. యిట్టి సహాయ మొనర్పదగిన వేమైన గలవా?

వారణసేవ లెన్నయిన వాజిబలుండగు రాజు కెప్పుడున్వైరుల బోర గెల్తురని వారణరాజలు నిక్కువంబు దుర్వారపువాజి యొక్కటి నివాసమునం కలిగున్న ఱేనికిన్వారక శంకనొందుదురు వైరులు మున్నుగ కంపభూవరా.

విశ్వంబందు వసుంధరాపతులకున్ విఖ్యాతిబీజంబులైయశ్వంబుల్ గడునాథుకార్యములు చేయంజాలుచందంబునన్శశ్వద్దాన వమాంపటీనిలసనస్తంబేరమం బుల్కడున్యైశ్వర్యాఢ్యపదాతిలోకములు సేయంజాలునే క్రమ్మరన్.

కరిరథవీరభీషణవికారజలగ్రహకోటిచేత దుస్తరమగు వైరిభూరమణ |సైన్యపయోధి నెన్నశశ్వమందరగిరి ద్రచ్చెగాక మరి తక్కినరీతులు ద్రచ్చవచ్చునేయరయగ వీరలక్ష్మి నిలనొభశతంపధరాతలేశ్వరా.

గజబలములు రథములు పదాతులు జలములతో నింపబడిన కందకములు గల్గి తరింప శక్యమి కాకయుండు శత్రురాజుల సైన్యమను పాలసముద్రమును ద్రచ్చుటకు నశ్వమె మందరపర్వతము. అదియే లేనిచో శత్రుసైన్యపయోధి ద్రచ్చుట యెట్లు?

ధరణీమండల మెల్ల నశ్వముల చేతం జాల సిద్ధించు నద్ధరణీమండల సిద్ధియైన వలనం ధర్మార్థకామంబులన్ధరణీ పాలకమండలంబులకు హస్తప్రాప్తమౌ గాన యద్ధరణీరాజుల లాభసంపదకు గంధర్వంబులే మూలముల్.

రాజ్యభోగములు అశ్వముల చేత లభించును. రాజ్యమువలన ధర్మార్థకామమోక్షంబులను చతుర్విధ ఫలంబులు లభించును. కా

వున రాజుల జయమునకు సౌఖ్యమునకు (యిహపరసౌఖ్యమునకు) మూలకారణము లీయశ్వములె గదా.

దావానేక పరోహిరంబు ధరవోత్తాలంబు శాంతాపశంసానూనద్యుతీ దుర్నిరీక్షమురుబాణాపారముద్యద్విషత్సేనావారధిమండలంబు గరిమం జెండాడు నుద్దండతన్భూనాధుండు హయాధిరూఢు లగుచున్ బోరున్ సమీరాకృతిన్.

పరశుభలక్షణంబులను వర్ణనకెక్కిన ఘోటకంబులన్ధరణిపు డెక్కిబోవలయు దజ్జగతీపతి గోరివచ్చు నింపరుదున శత్రులక్ష్మి విభవాన్వితయై యభిసారికాకృతిన్దురమున గంపభూరమణ దోర్బల భీమకుమార మన్మథా.

వర్జితదుష్కృతసుకృతోసాక్ర్జితవివిధార్ధనిష్టరాహవకేళిన్నిర్జితశత్రుసముత్కరమార్టితవైభవ సముఖతాయతకీర్తిన్.

చెలగి దేవాసురాదులకు నయ్యింద్రుడుసామంబులను దేసపాతసమితినాత్మ భాష్యంబున ననిల దేవుని యందునమృత పూరంబుల పండములునువాజుల సృజియించి వనజాసనుడు వానికన్నుల కమలారి కమలహితులవాతెర సురనది వాణి జిహ్వికయందుయెద నగ్ని మణుగు యెడల దిశలపసరునుక్కున నంగము నసలు నిలిపికాన హరులను వేల్పులుగా దలంచినెమ్మి పూజించి యెక్కిన నృపుల కెచటజయము చేకూరు గంపనక్ష్మాతలేంద్ర.

సుమనోవాహిని రోమరాజి జలధి స్తోమంబు కాంచీకళాపము శైలంబులు చన్నుగుబ్బలు పురప్రాకారముల్ తారహారములై యొప్పుగ నొప్పుచున్న యతుల ప్రారంభ విశ్వంభరాప్రమదం బార సుఖించు యశ్వపతియున్ ప్రసావర శ్రీగతిన్.

తురగము నాజి నెక్కి నిజదోర్బలలీలల జూపి విద్విషత్సరకరవాలధార దెగగాంచిన పుణ్యుడు సందగాంచు తత్తురగము మేనిపై గలయ దోచిన రోమము లెన్ని యన్నివత్సరములు నాకలోక వనితాసుఖ ముఖ్య విశేషసౌఖ్యముల్.

నెమ్మది లోన నెంతయును నిశ్చలభక్తి చరింపరేవు నేమమ్మున సర్వలక్షణసమన్వితమైన హయంబు నిష్టదైవమ్ము దిభాతినే నృపతి వందన కృత్యము లాచరించు నిత్యమ్మును నామహీపతికి నాయువలును నగ్గలంబగున్.

సమవిష మాజి రంగముల శత్రుశరంబుల దూరి పారుచోగమిగొని ప్రేవులెల్ల దెగి కాళ్ళను దాకుచు వ్రేలుచుండినన్దనుక మొకింత లేక నుచితస్థితి నేలిక నుద్ధరింపు చిత్తమతురగంబు దాని నుతి దామరసూతియు జేయనొప్పునే.

పరిహృతరిపు గర్వా ప్రాప్త గర్వాప హర్వాభరణ విపులసేనా ప్రఖ్య నాఖ్యాభిరామాపరిచిత న్నపనిద్యా ప్రస్పురద్గద్య పద్యాచరణ పతిత భూపా చాళుకీవంశదీపా.

గద్యము..................................................భైరవాచార్యపుత్ర మనమంచిభట్టు ప్రణీతమైన హయలక్షణవిలాసంబునందలిప్రథమాంకురము